Wednesday, July 29, 2015

మేథావులారా మేల్కొండి - Awoke

By 1:03 AM

మేథావులారా మేల్కొండి

Wed, 31 Mar 2010, IST    aa
ఈ మధ్య మన తెలుగుదేశంలో తెలుగులో మాట్లాడారని రెండు, మూడు చోట్ల విద్యార్థులని
ఉపాధ్యాయులు శిక్షించారన్న వార్త వినగానే భాషాభిమానుల మనసు క్షోభతో విలవిలలాడిన మాట వాస్తవం. నిజానికి అంతకన్నా బాధపడాల్సిన అంశం ఏమిటంటే పై సంఘటనలు జరిగిన తర్వాత మన భాష మీదే ఆధారపడి బ్రతుకుతున్న కవులు, కళాకారులు, మహా మహా రచయితలు తగు రీతిలో స్పందించకపోవడం గురించే.
ఒకానొకప్పుడు తెలుగుని ప్రాచీనభాషగా గుర్తించాలనే వాదన తెరమీదకి వచ్చినపుడు ఇదే కవులు, మేథావులు, రచయితలు తెలుగు భాష ఘనత గురించి, విశిష్టత గుర్తించి కవితలల్లి, విస్తృతంగా వ్యాసాలు వ్రాసి తెలుగు గొప్పతనాన్ని, ప్రాచీనతని లోకానికి ఘనంగానే చాటారు. కానీ నేడు తెలుగుకి అపచారం, అపకారం కల్సి జరిగినపుడు, జరుగుతున్నపుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు మిన్నకుండి పోవడం దారుణం. ఆశించిన రీతిలో స్పందించని వారు కొందరైతే, అస్సలు స్పందించని వారు మరి కొందరు. ఈ విషయంలో జ్ఞానపీఠులు, సాంస్కృతిక అకాడమీ పురస్కార గ్రహీతలు, మహాకవులు, మేథావులు మాత్రమే కాదు చిన్న చిన్న రచయితలు సైతం ఇదే పంథాని అనుసరించడం గర్హనీయం.
నేడు తెలుగుభాష ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలలో మేథావుల స్పందనారాహిత్యం కూడా ఒకటి. ఏదైనా రాజకీయ, అర్థిక, సామాజిక సమస్యలు ముంచుకొచ్చినపుడు విపరీతంగా స్పందించి పుంఖానుపుంఖాలుగా వ్రాసి, ప్రజల్ని చైతన్యపరిచే మహానుభావలెవరూ కూడా మాతృభాష విషయానికి వచ్చేసరికి ఉలకరు, పలకరు, గళమెత్తరు సరికదా కనీసం కలంతోనైనా ప్రశ్నించరు. ద్రౌపది నవల మీద జరిగినంత విస్తృతమైన చర్చ మాతృభాషకి జరిగిన అన్యాయం మీద జరగకపోవడమనేది ఏమి అర్థాన్ని సూచిస్తుందో ఆయా రచయితలకే తెలియాలి.
ఒకరి రచనల మీద మరొకరు బురద చల్లుకుని ఒకరి కవిత్వం మీద మరొకరు బురద చల్లుకోవడానికి మనవారు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మాతృభాషకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎవ్వరూ ప్రశ్నించారు. ప్రశ్నించినా అంతంత మాత్రంగానే...దీనికి కారణం బహుశా ఎన్నిసార్లు చెప్పినా తెలుగు వారిలో భాషా వ్యామోహం పాదుకొల్పలేమనే భావన వారిలో పాతుకుపోయి ఉండి ఉండవచ్చు. కానీ ఎన్నిసార్లైనా సరే చెప్పి తెలుగు ప్రజలలో చైతన్యం రగల్చాల్సిన బాధ్యత నేటి మేటి రచయితల కందరికీ ఉంది.
సాటివారైన తమిళులు, కన్నడిగులు మాతృభాషాభి మానంతో తమ తమ భాషలని మెరుగుపరుచుకోవడానికి, వాటివాటి అస్థిత్వాన్ని విదేశీభాష (ఆంగ్ల)ల నుండి రక్షించుకోవడానికి తపనపడి, తాపత్రయపడి పనిగట్టుకుని తమ తమ భాషలలో వాడుకలో వున్న విదేశీ పదాల్ని పేర్లను తొలగించి, ఆయా పేర్లకు, పదాలకు సమానార్థకాలైన దేశీపదాలను, పేర్లను కనుగొని, వాడుకలోకి తెచ్చి, జనసామాన్యంలో బహుళప్రచారం చేసిమాతృభాషా సేవలో పులకించి తరించిపోతుంటే మనవారికి చీమకుట్టినట్లయినా
ఉండదు సరికాదా? వారిదంతా వెర్రివ్యామోహం అని విపరీతార్థాలు తీసే వింతైన వాదన మనవారిది. ప్రతీరోజూ ఉదయం నిద్రలేచిన దగ్గరనుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్నెన్ని విదేశీ (ఆంగ్ల) పదాలు మన నాలుకల మీద కెక్కి వికృత కరాళనృత్యం చేస్తున్నాయో మనకందరికీ తెలిసిందే. నిజానికి వాటికి సమానార్థకాలైన పేర్లు, పదాలు తెలుగులో లేవా అంటే? లేకేం ఉన్నాయి. కానీ మనవాళ్ళకి ఆంగ్లం మీద ఉన్న మోజు, ఆసక్తి తేనెలొలికే తెలుగు మీద లేకపోవడమే. ఇది ఒకెత్తయితే లేని వాటికి సమానార్థకాలైన దేశీపదాల్ని, పేర్లని తయారుచేసి వాడుకలోకి తీసుకురావాలనే శ్రద్ధ భాషా పండితులకు, ప్రభుత్వానికి , రచయితలకు లేకపోవడం మరో ఎత్తు. తెలుగులో ఒక్క ఆంగ్లపదాలే కాదు ఎన్నో మరెన్నో భాషా పదాలు కలిసి కలగలిసి ఉన్నాయన్నది నిజమే. ప్రతీభాష ఇందుకు విరుద్ధమేమీకాదు. పైగా భాష విస్తృతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి కూడా. కానీ ఆంగ్లంతో వచ్చిన పేచీ వేరు. ఇది అంతర్జాతీయ భాష. ఆంగ్లపదాలు, పేర్లు ఇతర భాషా పదాలలాగా తెలుగులోనేకాదు మరే భాషలలోనూ ఒదిగిపోవు. దానికున్న విస్తృతి అటువంటిది ఉదాహరణకు ఏ తమిళపదమే, బెంగాలీ పదమో తెలుగులో వాడుకలో వున్నా అది ఫలానా భాషకు చెందినదని చెపితేగానీ అర్థంకాదు, కానీ ఆంగ్లభాషా పదాల్ని, పేర్లని ఇవి ఫలానా భాషా పదాలని ఒకరు విడమర్చి చెప్పనవసరం లేదు. ఎవ్వరికైనా ఇట్టే అవగతమవుతుంది. అవి ఆంగ్ల పదాలని. ఆంగ్లభాష పరిధి అటువంటిది. పైగా తెలుగువారిలో ఆంగ్లంలో మాట్లాడటమే నాగరికతగా భావించే వేలం వెర్రి పట్టణాల్లోనే కాదు పల్లెల్లో సైతం బాగా విస్తరిస్తోంది. విస్తరించింది కూడా. దీన్ని కనుక తెలుగుభాషాభిమానులు, భాషాపండితులు, మేథావులు ఎదుర్కొపోతే తేనెలొలికే తెలుగుకాస్తా టెక్కులొలికే టెల్గుగా' మారిపోతుందనేది నిర్వవాదాంశం. కనుక ఈ విషయంలో మనమందరం మేల్కొని, ముఖ్యంగా మేథావులు, రచయితలు, భాషా పండితులు మేల్కొని, తెలుగువారిలో చైతన్యం రగల్చాల్సిన అగత్యం ఎంతైనా ఉంది. తెలుగువారంతా తెలుగులోనే మాట్లాడేలా ప్రొత్సాహించి, ప్రోదికల్పి, ప్రాథమిక, ఉన్నత విద్యలలో మాతృభాషా బోధన తప్పనిసరిగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా భాషా పండితులు, రచయితలు,క్రొత్త క్రొత్తదేశీపదాల్ని సృష్టించి, విస్తృతికల్పించి జనసామాన్యంలోకి తీసుకురాగల్గినపుడే తెలుగు భాష వెలుగులీనుతూ పదికాలాల పాటు మనుగడ సాగించగులుగుతుంది. లేకుంటే ప్రాచీనభాషగానే మిగిలిపోయి ఆదరణను కోల్పోతుంది. మాయాబజార్‌లో ఘటోత్కచుడన్నట్లు '' ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి మరి'' కనుకే మేధావులారా ఇప్పటికైనా మేల్కోండి.
- గొడవర్తి శ్రీనివాసు

0 comments: