తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం
'సమాజాన్ని మార్చే కృషిలో సాహిత్యానికి ఎంతో కొంత పాత్ర ఉంటుంది. అలాంటి సాహిత్యంతో నాకు అనుబంధం ఉంది. ఉద్యమాలు లేకుండా సాహిత్యం నిర్ణయాత్మకమైన పాత్ర నిర్వహించలేదు. తెలుగులో మొదటినుంచి రాజకీయ ఉద్యమాలు సాహిత్యవ్యాప్తికి దోహదం చేశాయి.ఇది ఎవరూ కాదనలేని సత్యం. ప్రజారాజకీయాల ప్రభావంతో సాగే సాహిత్య ఉద్యమంలో నేను భాగస్వామిని. ఉద్యమం ఆరోగ్యవంతంగా కొనసాగాలంటే సాహిత్యం పట్ల ఆసక్తి ఉండి నిజాయితీతో పనిచేసే వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తుల్లో నేనొకణ్ణ్ణి' అంటూ సాహిత్యరంగంలో తన కృషి గురించి చెప్పుకున్న చలసాని ప్రసాద్-కవి, రచయిత, విమర్శకుడు, సమీక్షకుడు, అనువాదకుడు, విప్లవసాహితీ కార్యకర్త.
1957లో ఎమ్.ఏ.పట్టభద్రుడైన చలసాని ప్రసాద్, బతుకు తెరువుకోసం కొంతకాలం స్టేట్ గవర్న మెంటు గుమస్తాగానూ, కొంతకాలం కాజీపేట రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్ రైల్వేకేటరింగ్ మేనేజరు గానూ, కొంత కాలం వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ సూపరింటెండెంట్‌గానూ పనిచేశారు. తరువాత 1965లో సినిమారంగంలో చేరి 'కలిమిలేములు' చిత్రానికి ప్రముఖరచయిత గోపీచంద్‌కి స్క్రిఫ్ట్ అసిస్టెంటుగానూ, ప్రముఖ దర్శకనిర్మాత కె.ప్రత్యగాత్మ నిర్మించిన 'చిలకాగోరింక', 'మా వదిన' చిత్రాలకు నిర్మాణ నిర్వహకుడిగానూ పనిచేశారు. 1968 నుండి విశాఖపట్నం ఏ.వి.యన్ కళాశాలలో పాలిటిక్స్ అధ్యాపకుడిగా చేరి, అందులో స్థిరపడి అక్కడే 1992లో పదవీ విరమణ పొందారు.
1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారసభకు సాంస్కృతిక సైనికుడిగా మహాకవి శ్రీశ్రీ హనుమాన్ జంక్షన్ వచ్చారని తెలిసి, గుడివాడ నుండి 12 మైళ్లు సైకిలు తొక్కుకువెళ్లి శ్రీశ్రీని మొట్టమొదటిసారి చూశాననీ, అది తన జీవితంలోని ఒక గొప్ప మధురానుభూతి అని చెప్పుకునే ప్రసాద్, మహాకవి శ్రీశ్రీకి వీరాభిమాని.తలపండిన నిలువెత్తు శ్రీశ్రీ సమాచారం.ఆయన శ్రీశ్రీ గురించి అటు సాహిత్యం లోనూ, ఇటు జీవితంలోనూ ఎటువంటి ప్రశ్నయినా సరే, అడిగేవారినోటి నుంచి పూర్తిగా రాకుండానే సమాధానం చెప్పగల ఒకే ఒక్కడు. శ్రీశ్రీపై ఆయన భక్తి, అనురక్తి, అక్షరాలకు అందనిది. మహాకవి శ్రీశ్రీపై చలసాని ప్రసాద్‌ది శ్రీశ్రీ విరోధులు ద్వేషించేంత అనురాగం. శ్రీశ్రీ అభిమానులు ఈర్ష్యపడేంత అభిమానం.
02-01-1910గా, అప్పటివరకు చలామణీ అవుతున్న మహాకవిశ్రీశ్రీ జన్మదినాన్ని, శోధించి, 1910 ఏప్రిల్ 30గా కచ్చితమైన ఆధారాలతో సాధించిన, అసహాయ శ్రీశ్రీ సహాయశూరుడు. శ్రీశ్రీ అంటే చలసాని ప్రసాద్‌కే కాదు,చలసాని ప్రసాద్ అన్నా శ్రీశ్రీకి ఎంతో అభిమానం.చలసాని ప్రసాద్ శ్రీశ్రీకి అత్యంత సన్నిహి తులు, స్నేహితులు. శ్రీశ్రీ-తన మొదటిభార్య రమణమ్మ గారిని కౌసల్యఅనీ, రెండో భార్య సరోజగారిని సుమిత్ర అనీ, ప్రసాద్‌గారిని కైక అనీ ముద్దుగానూ, అభిమానం గానూ, ప్రేమతోనూ పిలుచుకొనేవారు.
జాతీయోద్యమ నేపథ్యమున్న కుటుంబంలో చలసాని జన్మించారు. అందువలన ఉద్యమ సమ యంలో ఇంటిపై తరుచూ దాడులు జరుగుతుండేవి. అలా జరిగిన కాల్పుల్లో బాబాయి, బావ, అన్నయ్య పోలీసుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి అమరవీరుల కుటుంబ నేపథ్యం కలిగిన చలసాని తొలిజనరల్ ఎన్నికల సంరంభంలో రాజకీయాలలో కళ్లుతెరిచారు. హైస్కూలు దశలోనే ఎర్రజెండా చేతబట్టి మరణించేదాకా తెలుగునాట ప్రజాఉద్యమాలతో కొనసాగారు. ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ సభ్యులు. కమ్యూనిస్టు పార్టీ 1964చీలికలో సి.పి.ఎంవైపూ, 1969 చీలికలో ఎం.ఎల్‌వైపూ పనిచేశారు.విరసం సంస్థాపక కార్యవర్గ సభ్యులు. 1986-88లో ప్రధాన కార్యదర్శిగానూ, కె.వి.ఆర్ మరణానంతరం 1998-2000లో విరసం అధ్యక్షులుగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయి జైలుజీవితం అనుభవించారు. ఇక లెక్కలేనన్ని బూటకపు ఎన్‌కౌంటర్లను జీవిత కాలం నిరసిస్తూనే ఉన్నారు. నిరసిస్తూ లెక్కలేనన్ని సార్లు అరెస్టయ్యారు.
విరసం ఆవిర్భావం విషయంలో చలసాని ప్రసాద్ ముఖ్యపాత్ర నిర్వహించారు. విరసం ప్రచురించిన 'శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం' 21సంపుటాలకు(అనుబంధ సంపుటితో కలిపి) సంపాదకత్వం వహించారు. దానికి తను చేసిన కృషి, 'శ్రీశ్రీ సాహిత్యం' (1970)ఆరుసంపుటాలకు(ఆంగ్ల సంపుటంతో కలిపి) కె.వి.ఆర్ చేసిన కృషికి కొనసాగింపేనని వినయంగా చెప్పుకొన్నా,'శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం'ను అత్యంత బాధ్యతాయుతంగానూ, అతి విలువైన ఫుట్‌నోట్స్ తోనూ, అనన్య సామాన్యంగానూ అందించి తెలుగు జాతికి మహోపకారం చేశారు.
విరసం ప్రచుణలు 'కొకు వ్యాసప్రపంచం'(ఆరు సంపుటాలు)కూ,'కొకు రచనాప్రపంచం'(18 సంపుటాలు)కూ,త్రిపురనేని 'గోపీచంద్ రచనా సర్వస్వం'(10 సంపుటాలు)కూ తుమ్మల కృష్ణాబాయితో, 'కె.వి.ఆర్. సాహిత్యలేఖలు'కు ఎన్.వేణుగోపాల్‌తో, శతజయంతికి మనసు ఫౌండేషన్ ప్రచురణ 'శ్రీశ్రీ ప్రస్థానత్రయం' (3సంపుటాలకు)కు శ్రీ యం.వి.రాయుడు (బెంగుళూరు)తో కలిసి సంపాదకత్వం వహించారు.
'చలసాని ప్రసాద్ సాహిత్య వ్యాసాలు'(2003) 'చలసాని ప్రసాద్ రచనలు'(2008), పేరున రెండు సంపుటాలు ఆయన రచనలను విరసం ప్రచురించింది. చలసాని జీవిత కాలంలో శ్రీశ్రీ గురించిన, శ్రీశ్రీపై చలసాని సాహిత్యసర్వస్వంగా 'చిరంజీవి శ్రీశ్రీ' పేరున శ్రీశ్రీసాహిత్యనిధి శ్రీశ్రీ విరించివీ, శ్రీశ్రీ గురించివీ నూరుపుస్తకాల హోరు ప్రణాళికలో భాగంగా 24వ పుస్తకంగా శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురించింది. 'మేరువంతటి మహాకవి నిధులను నిర్విరామంగా కూర్చి, పేర్చి, ఏర్చి తెలుగు సమాజ హృదయంలో నిక్షిప్తం చేస్తున్న శ్రీశ్రీ సాహిత్యనిధి అంటూ అంకిత మిచ్చారు.
చలసాని సాధించిన మరో ముఖ్య విజయం ఆయన వ్యక్తిగత గ్రంథాలయం. ఎన్నో అద్భుతాలు ఉన్న విశాఖలో చలసాని గ్రంథాలయం ఒక అద్భుతం. ఒకప్పుడు ప్రత్యేకంగా చెప్పుకునే నార్ల, ఆరుద్ర, జగ్గయ్యల గ్రంథాలయాలను ప్రమాణంలో మించిన గ్రంథాలయం. ప్రజల యుద్ధాలూ..ప్రభుత్వ నిషిద్ధాలూ..చోటుచేసుకున్న గ్రంథాలయం. ఆ గ్రంథాలయం గదులకు శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొడవటిగంటి పేర్లు పెట్టడం విశేషం.
''సాహిత్యాన్ని చరిత్రపరంగా,సామాజిక పరంగా, రాజకీయఉద్యమపరంగా విశ్లేషించాలని నా అభిలాష'' అనిచెబుతూ,అలానే విశ్లేషిస్తూ-విరసాన్నీ, శ్రీశ్రీని రెండుకళ్లుగా భావించే చలసానిప్రసాద్,1932 డిశంబరు, 8నకృష్ణాజిల్లా, నాదెళ్లవారిపాలెంలో జన్మించారు 2015 జూలై,25న విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు. ఆయన కళ్లనూ, కాయాన్ని ఆయన కోరిక మేరకు మెడికల్ కాలేజీకి అందించారు.
చలసాని బసవయ్య, వెంకట నరసమ్మ చలసాని ప్రసాద్ తల్లిదండ్రులు. ఆయన భార్య విజయలక్ష్మి 2003లో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు విప్లవోద్యమంలో పనిచేస్తున్న నవత, మరొకరు కాలేజి లెక్చరర్‌గా పనిచేస్తున్న మమత .
- సింగంపల్లి అశోక్‌కుమార్
శ్రీశ్రీ సాహిత్యనిధి
0 comments:
Post a Comment