మొలకగింజలలో పోషకాలు!
మనం తీసుకునే ఆహారంలో గింజధాన్యాలే ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మామూలు గింజలకంటే, మొలకలు వచ్చిన గింజలలోనే పోషకవిలువలు సమృద్దిగా లభిస్తాయి. ముడి ధాన్యాలకంటే, మామూలు గింజల కంటే మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు, శెనగలు, మినుములు, బఠాణీలు, వేరుశెనగ గింజలు, మొక్కజొన్న గింజలు లాంటివి ఎక్కువగా వాడడం వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుంది. వీటిని ఆహార పదార్థాల్లో చేర్చడం మంచిది. ఇవేకాక, బార్లీ, ధనియాలు, లాంటివి కూడా గింజధాన్యాలలోకే చేరతాయి.
మొలక గింజలను తాలింపువేసి, అందులోని సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, నిమ్మరసం కలిపితింటే ఎంతో రుచిగా ఉండటమే కాక, వాటిలోని పోషకవిలువలు శరీరానికి అందుతాయి. ముఖ్యంగా, ఆటలాడే పిల్లలకు మొలక గింజలను తినిపిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. వారానికి రెండు, మూడు సార్లు మొలక గింజలను తినడం ఆరోగ్యకరం. ఉదయం అల్పాహారంగా మొలకెత్తిన గింజలను తినడం వల్ల, ఎంజైములు చైతన్యవంతమవుతాయి. అందువల్ల పోషక విలువలు వాటిలో అధికంగా లభిస్తాయి. మొలక గింజలలోని ఎంజైములు చర్య ప్రారంభించడం వల్ల గింజలలోని సంక్లిష్టపదార్థాలు తేలికగా మారి, జీర్ణక్రియకు చక్కగా తోడ్పడతాయి. మొలకెత్తిన గింజలను, డయాబెటిస్ వ్యాధితో బాధపడే రోగులు కూడా తినవచ్చు. మొలకగింజలలో కార్బోహైడ్రేట్స్ శాతం తగ్గిపోయి, విటమినులు పెరుగుతాయి. మొలక గింజల్లో ఎ విటమిన్, రెబోఫ్లోవిన్, దయామిన్, నియాసిస్ లాంటి పోషక పదార్థాలు లభిస్తాయి. ఆహార పదార్థాల్లో ప్రధానమయిన గింజ ధాన్యాలను చేరుస్తూ, పోషకాహారలోపం కలుగకుండానూ, శరీరానికి శక్తిని సమకూరుస్తూ, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.
- కె.నిర్మల
0 comments:
Post a Comment