భారత స్వాతంత్రోద్యమంలో మహిళా ఉద్యమకారులు
1857లో 'మాతా తపస్విని' తన పినతల్లి ఝాన్సీరాణి లకీëబాయితోపాటు బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించింది. నానాసాహెబ్‌తోపాటు నేపాల్ వెళ్ళింది. బెంగాల్ ప్రజల తిరుగుబాటుకు ప్రేరణగా నిలిచింది.
సరళాదేవి చౌదరి : అరవిందఘోష్ ఆశ్రమ వాసికాక ముందు, స్వాతంత్రోద్యమనేత. అతడే సరళాదేవి చౌదరిని పంజాబ్‌లో ఉద్యమానికి ప్రేరేపించాడు. ఆమె 'సియాన్' పత్రికను ఉర్దు, ఇంగ్లీష్‌లో ప్రారంభించింది. రౌలట్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. 1917లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో జాతీయగీతం పాడింది. అజిత్‌సింగ్, సరళాదేవి ఉత్తేజకర ప్రసంగాలు పుస్తకంగా వెలువడినాయి.
మేడం కామా : దాదాభాయి నౌరోజి కార్యదర్శిగా ఇంగ్లండులో పనిచేసింది. 'విప్లవాలకు మాతృమూర్తిగా' పేరుగాంచింది. స్వయంగా జాతీయ పతాకాన్ని తయారు చేసింది. 1907లో జర్మనీలోని స్టేట్‌గార్డ్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభలో పతాకాన్ని ఎగురవేసి అత్యంత ఉత్తేజకరంగా ఉపన్యసించి, ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్య్రం కోసం తీవ్ర ప్రచారం చేసింది.
సుహాసిని (పటౌడి) : విప్లవనేత రసిక్‌లాల్ శిష్యురాలిగా విప్లవోద్యమ నిర్వహణలో శిక్షణ పొందింది. 1910లో తిరుగుబాటుదార్లకు నాయకత్వం వహించి 8 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి కమ్యూనిస్ట్ పార్టీకి సానుకూలంగా
ఉండేది.
శాంతి ఘోష్ : సునీతిచౌదరితో కలిసి 1931లో కొమిల్లా జిల్లా మేజిస్ట్రేట్‌ను కాల్చివేసింది. జీవితఖైదు విధింపబడి 1931లో విడుదల అయ్యింది. సునీతి, శాంతి ఘోష్‌లు ఛత్రీసంగ్‌ను స్థాపించారు.ఆ సంస్థలో చేరిన యువతీ యువకులకు తుపాకులు పేల్చటం, కత్తి యుద్ధం మున్నగు వాటిల్లో కొండల్లో శిక్షణ ఇచ్చారు.
బీనాదాస్ : ఆమె 1911లో జన్మించింది. 1928లో సైమన్ కమిషన్‌ను వ్యతిరేకించింది. సుహానినీదత్తా, శాంతిదాస్‌గుప్తా అన్న విప్లవ వీరుల సహచరిగా పనిచేసింది. ఆమె నాయకత్వంలో చిన్న విప్లవకారుల సంఘం ఉండేది. 1932 ఫిబ్రవరి 6న గవర్నర్ కాన్వొకేషన్ స్పీచ్ ఇస్తున్నపుడు అతనిని హతమార్చాలని పిస్టల్ పేల్చింది. కానీ అది గురితప్పింది. బాబీదాస్‌కు 9 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించారు. 1939లో విడుదలైంది. 1946 నుండి 1951 వరకు బెంగాల్ శాసనమండలి సభ్యురాలుగా ఉండేది. నౌకాళి దురంతాల్లో బాధపడిన వారికోసం శరణాలయాలు స్థాపించి వారిని ఆదుకొన్నది.
కల్పనాదత్త : ఈమె కలకత్తాలో ఉంటూ బాంబులు తయారు చేయుటకు కావలసిన వస్తువులను సేకరించేది. వాటిని చిట్టగాంగ్‌కు తరలించి తన ఇంట్లోనే బాంబులు తయారు చేసేది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషిని పెళ్ళాడింది.
ఉజ్వల : 1914లో ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి జమిందారుగా ఉంటూ బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమానికి సహాయం చేశాడు. కూతురు ఉజ్వల 14 ఏళ్ళ వయస్సులోనే ఆయుధాలను విప్లవ కారులకు అందజేసేది. ఆమె మిత్రులు భవాని, రవిలతోపాటు, డార్జిలింగ్‌లో గవర్నర్‌ను కాల్చి చంపాలని యత్నించారు. కానీ వారు గురితప్పారు. ఆమెకు, భవాని, రవిలకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వం నిశ్చయించింది. కానీ జీవితఖైదుగా మార్చారు. ఆమె సహాజసేవా కార్యక్రమాలు చేపట్టి 'పల్లినికేతన్' సంస్థను ప్రారంభించింది.
అరుణా గంగూలి : క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నది. అజ్ఞాతంగా ఉంటూ పోరాడింది. ప్రముఖ జాతీయ నాయకుడు ఆసఫ్ ఆలీని వివాహం చేసుకొన్నారు. విప్లవోద్యమ నేతగా ఆమె చేస్తున్న కార్యాలను గమనించి ఆమెను పట్టిఇచ్చిన వారికి 5వేల రూపాయల బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. లోహియాతోపాటు 'ఇంక్విలాబ్' పత్రికను ప్రారంభించింది. ఆమె తర్వాత 'లింక్, 'పేట్రియట్' పత్రికలను ప్రారంభించింది.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి
0 comments:
Post a Comment