ఆదర్శ సామ్యవాదాన్ని ఆచరించి చూపిన చలసాని
ఆదర్శాలు వల్లించటం సులభం. ఆచరించి చూపటం బహుదుర్లభం. ఆదర్శాలకు ఆచరణకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటున్నది. అయితే 'అందరూ నాకు హితులూ, స్నేహితులే... ప్రజలే నా బంధువులు ఎవరి బిడ్డలైనా, నా పిల్లలే....పార్టీనే ఆస్తి.... నమ్ముకున్న సిద్ధాంతమే నాకు జీవనమార్గం' అన్న ఆదర్శ కమ్యూనిస్టులూ, రచయితలూ, ప్రజా నాయకులూ కొద్ది మంది ఉన్నారు. వారిలో ఒకరు చలసాని ప్రసాద్. జీవితానికీ, సాహిత్యానికీ పూర్తి తాదాత్మ్యం, సాహిత్యానికీ, రాజకీయానికీ ఏకాత్మత, రాజకీయానికీ నిత్య జీవితానికీ పూర్తి సంఘటితరూపం ఇచ్చిన బహు కొద్ది మందిలో చలసాని ప్రసాద్ ఒకరు. బహుశా ముఖ్యులు కూడా.
నిజమే.... ఆయనది మావోయిస్టు విధానం. విప్లవ రచయితల సంఘానికి కర్తా, భర్తా, వ్యవహర్తా.... ఆచరణలో నూరు శాతం నమ్మిన విధానాలను అమలు చేయటం... ఆయన ప్రత్యేకత. అరసం నుండి పుట్టిన సంస్థ కావటం చేత వి.ర.సా.నికి దాయాది వైరం ఉన్నమాట నిజమే. చర్చలకు, ఖండనలకు, ఎత్తి పొడుపులకు, వ్యంగ్య బాణాలకు, పాలిమిక్స్ అనే వాదాస్త్రాలకు ప్రసాద్ అంకితమైన వ్యక్తే. అందులో సందేహం లేదు. అందులోనూ 1970-80 ప్రాంతంలో అ.ర.సం. బలమైన సంస్థగా అతివాదాన్ని, మావోయిజాన్ని, విరసాన్ని ఎదిరించిన మాట కూడా వాస్తవం. సి.పి.ఐ.కు సోదర సంస్థగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, జాతీయవాదాన్ని, రష్యా స్నేహాన్ని, వామపక్షాల ఐక్యతనూ బలపరచిన మాట కూడా పచ్చి నిజం. ఇవన్నీ నచ్చని వి.ర.సం. కార్యశీలిగా అరసంతో ఘర్షించినా, కమ్యూనిస్టు హృదయంతో ప్రజా సంస్థలను చూసి, పలకరించి, సహకరించి సంఘీభావం ప్రకటించే వ్యక్తి చలసాని ప్రసాద్. ఈ వైరుధ్యాన్ని స్నేహ వైరుధ్యంగానే చూసేవాడు. నక్సలైటు ఉద్యమం ఉద్ధృత స్వరూపంలో ఉన్నది. అణచివేతలు నిషేధాలు కొనసాగుతున్నాయి. సి.పి.ఐ., అ.ర.సం వీటిని ఖండించి సోదర వామపక్షాల ఐక్యతకు కృషి సలిపేవి. అందుకే ప్రసాద్‌కు, ఇతర విరసం నాయకులకు భిన్నంగా అన్ని శాఖల్లోనూ మిత్రవర్గం ఉండేది. నిన్న చనిపోయేదాకా ఆ స్నేహం అవిచ్ఛిన్నంగా సాగింది.
బయటకు ఎంత సౌమ్యుడో, లోన అంత కరుడు గట్టిన నిబద్ధుడు. పోతపోసిన శిలల వంటి అభిప్రాయాలు -విశ్వాసాలు, ప్రేమలు, అభిమానాలు, మాయా బజార్ సినిమా అన్నా, ఎస్వీ రంగారావు నటన అన్నా, ఆత్రేయ మాటలన్నా అంతే ప్రేమ. శ్రీశ్రీ అంటే పిచ్చి. గోపీచంద్‌కు మిత్రుడు. రావిశాస్త్రికి ప్రాణ స్నేహితుడు. రంగనాయకమ్మకు శ్రేయోభిలాషి. కుటుంబరావుకు శిష్య సమానుడు. రమణారెడ్డికి ప్రియ సహచరుడు. రా.రా.కు అభిమాని. బాలగోపాల్, వరవరరావు, గద్దర్, సత్యమూర్తి, వంగ పండులకు కామ్రేడ్ ఇన్‌ఆర్మ్స్, పురిపండాకు అభిమాన ప్రథముడు. కారా మాష్టారికి గౌరవనీయ మిత్రుడు.... చెప్పొద్దూ.... అలనాడు విజయవాడలో ఉండే రోజుల్లో చలసాని విశ్వనాథకు మంచి మిత్రుడు. ఈ మిత్ర భాగ్యమే అతను సంపాదించిన ఆస్తి-కూడబెట్టిన ధనం. అతని నిత్య చైతన్యానికి ఇంధనం. అతను సేకరించిన బృహత్తర గ్రంథాల సముదాయం 30 వేలకు చేరింది. సామ్యవాద సాహిత్య గ్రంథాలయంగా పేరు మార్చుకోబోతుంది.
ఆవకాయతో అన్నం, కోడిమాంసం ముక్కలు తప్ప అతను కోరిన సౌఖ్యాలు లేవు. బావుకున్న సౌభాగ్యాలు లేవు. కుమార్తెలు నవత, మమత... ఎప్పుడో చనిపోయిన భార్య విజయా.... వారిక్కూడా అతను అదనపు సంపదలు కూడ బెట్టి యివ్వలేదు. చేతులూ, కాళ్ళూ తప్ప... కృష్ణాబాయి, వేణు గార్లతో నమ్మిన విశ్వాసాల వేటలో కలిసి నడక. వరవరరావు ఎక్కడో అన్నట్లుగా ఆస్తిని జయించవచ్చు. అహంకారాన్ని జయించలేం. అలా జయించిన ఏకైక వ్యక్తి ప్రసాద్. నువ్వు ప్రసాద్‌ని నిందించు, తిట్టు... దూషించు. ఏమీ బాధపడడు. కారల్‌మార్క్స్‌నూ, శ్రీశ్రీని, రావిశాస్త్రిని పల్లెత్తి మాటన్నారో మీదపడి రక్కేయగలడు. అతని ప్రజాతత్వ సిద్ధాంతానికి యీ నిబద్ధత పరాకాష్ఠ.
పలుమార్లు నాతో ఎడ తెగని వివాదం. భారత రాజ్యాంగ పాత్రపైన, భారతీయ సామ్యవాద ఉద్యమ ప్రగతిపైనా 'సాయుధ పోరాటం యిక్కడ తగదు ప్రసాద్' అనేవాణ్ణి. అన్ని పార్టీలూ (కమ్యూనిస్టు) కలిసి పోరాడందే యింతటి విశాల భారతంలో విజయం కష్టం అనేవాణ్ణి. కాసేపు మౌనం... తర్వాత ''ముందు పార్లమెంటరీ కమ్యూనిస్టుపార్టీలన్నీ ఏకం కమ్మనండి. రాడికల్ పార్టీల సంగతి వారి కొదిలేయండి' అనేవాడు.
'దేశం చేజారిపోతోంది. కేవలం ధనవంతులూ, మార్కెట్ శక్తులూ, అవినీతి స్వాములూ సామ్రాట్టులవుతున్నారు... ఏమంటావు చలసానీ..' అంటే.
'మీ మామయ్య బొల్లిముంతను శ్రీశ్రీ చిల్లిముంత అన్నాడు. మీ గురువు సోమసుందర్‌ను దోమసుందర్ అన్నాడు'' అని పకపకా నవ్వుతూ సంభాషణ దారి మళ్ళించేవాడు.
అరసం 2004 విశాఖ మహాసభలకు హాజరయ్యాడు. జ్వాలాముఖి, కృష్ణాబాయిలచేత సందేశాలిప్పించటం చూసి చిరునవ్వులు నవ్వాడు. కృష్ణాబాయి మహాసభను చూసి 'పుట్టింటి కొచ్చినట్లుంది' అన్నప్పుడు ప్రసాద్ కూడా సంతోషించాడు !'' చింతేల నిగ్రహించు బలం లేకపోయినా...
ఏ పాటిదైన ''వెల్గు ప్రసాదించుతూ పద'' అన్న రాంభట్ల గేయంలోని సారం ప్రసాద్‌కు అర్థమైనంతగా ఇతరులెవ్వరికీ అర్థం కాలేదు. మంచికోసం, మనిషి కోసం, ప్రేమ కోసం, ఆదర్శమైన సమష్టి జీవనం కోసం ఆరాటపడిన అరుదైన వ్యక్తి... ఆదర్శజీవనుడు చలసాని ప్రసాద్ !
- చందు సుబ్బారావు
94413 60082
0 comments:
Post a Comment